
ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన మెమరీ ఆఫ్ ది వరల్డ్ కమిటీ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ (MOWCAP) 11వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ (IGNCA) కార్యదర్శి డాక్టర్ సచ్చిదానంద్ జోషి తెలిపారు. ఈ మూడు గ్రంథాలను యునెస్కో జాబితాలో చేర్చేందుకు అవసరమైన నామినేషన్ పత్రాల తయారీలో IGNCA కీలక పాత్ర పోషించింది.
ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. 2024లోనే భారత్‌కు చెందిన రామచరితమానస్, పంచతంత్రం, సహృదయాలోకలోచన గ్రంథాలు అదే ప్రాంతీయ రిజిస్టర్లో చోటు సంపాదించాయి. ఇప్పుడు తాజాగా మరో మూడు గ్రంథాలు చేరడంతో ఈ జాబితాలో భారత్ తరఫున నమోదైన గ్రంథాల సంఖ్య ఆరుకు చేరింది.
రాజతరంగిణి.. 12వ శతాబ్దంలోనే చరిత్రను ఆధారాలతో నమోదు చేసిన రచన!
కశ్మీర్ చరిత్ర గురించి తెలుసుకోవాలంటే రాజతరంగిణి ముఖ్య ఆధారం. కల్హణుడు 12వ శతాబ్దంలో రచించిన ఈ గ్రంథంలో కశ్మీర్‌ను పాలించిన రాజులు, వారి పాలన, రాజకీయ పరిణామాలు, అప్పటి ప్రజల సామాజిక, సాంస్కృతిక జీవన విధానాలను వివరించారు.
ఈ గ్రంథం ప్రత్యేకత ఏంటంటే.. కేవలం రాజుల గొప్పతనాన్ని కీర్తిస్తూ కథలు చెప్పడం మాత్రమే కాకుండా, అందుబాటులో ఉన్న ఆధారాలు, సంప్రదాయాలను పరిశీలిస్తూ చరిత్రను నమోదు చేయడం. విమర్శనాత్మక దృష్టితో గతాన్ని విశ్లేషించిన రచనగా రాజతరంగిణికి భారతీయ చరిత్ర రచనలో ప్రత్యేక స్థానం ఉంది. అందుకే దీనికి యునెస్కో గుర్తింపు రావడం విశేషం.
మహాభారతం.. యుద్ధగాథ మాత్రమే కాదు.. జీవితానికి ఎన్నో పాఠాలు!
మహాభారతం అంటే చాలా మందికి వెంటనే గుర్తుకొచ్చేది కురుక్షేత్ర యుద్ధం. కానీ ఈ మహా ఇతిహాసం పరిధి అంతకంటే ఎంతో విస్తృతమైంది. ధర్మం అంటే ఏంటి? కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలి? న్యాయం, అధికారం మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు ఏం చేయాలి? మనుషుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి? ఎన్నో జీవిత ప్రశ్నలకు ఇందులో సమాధానాలు కనిపిస్తాయి.
కౌరవులు, పాండవుల కథతో పాటు మానవ స్వభావం, నైతిక విలువలు, తాత్విక ఆలోచనలను ఇందులో విస్తృతంగా చర్చించారు. అందుకే మహాభారతం ఒక ఇతిహాసంగానే కాకుండా, తరతరాలకు జ్ఞానాన్ని అందించే గొప్ప సాంస్కృతిక సంపదగా నిలిచింది. భారతదేశంతో పాటు దక్షిణాసియాలోని అనేక ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలపై దీని ప్రభావం ఉంది.
కౌటిల్యుడి అర్థశాస్త్రం.. నేటికీ ఆసక్తి కలిగించే రాజ్యపాలనా సూత్రాలు!
మూడో గ్రంథం కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం. ప్రాచీన భారతదేశంలో రాజ్యపాలన, ఆర్థిక వ్యవస్థ, దౌత్య సంబంధాలు ఎలా ఉండేవో ఈ గ్రంథం వివరిస్తుంది. ఒక రాజ్యాన్ని సమర్థంగా ఎలా నడపాలి? పాలకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? ప్రజల సంక్షేమం, ఆర్థిక నిర్వహణకు ఎలాంటి విధానాలు అవసరం? ఇతర రాజ్యాలతో సంబంధాలను ఎలా కొనసాగించాలి? వంటి అంశాలపై ఇందులో లోతైన విశ్లేషణ ఉంది. రాజకీయ వ్యూహాలు, పరిపాలనా వ్యవస్థ, ఆర్థిక విధానాలు, భద్రత వంటి అంశాలను చర్చించిన ఈ రచన ప్రాచీన భారతీయ మేధో సంపదకు గొప్ప నిదర్శనం. అందుకే చరిత్ర, రాజకీయ శాస్త్రం, పరిపాలనపై ఆసక్తి ఉన్నవారికి అర్థశాస్త్రం ఇప్పటికీ ముఖ్యమైన గ్రంథంగా నిలుస్తోంది.
A moment of immense pride for India!
The inclusion of Rājataraṅgiṇī, Mahābhārata and Arthaśāstra in @UNESCO Memory of the World Asia-Pacific Regional Register is a landmark recognition of India’s extraordinary documentary and civilisational heritage.
These timeless works embody our rich traditions of historical inquiry, philosophical thought and statecraft, whose wisdom continues to inspire humanity.
Under the visionary leadership of Hon’ble PM Shri @narendramodi Ji, India’s civilisational legacy is receiving unprecedented global recognition and its rightful place on the world stage.
— Gajendra Singh Shekhawat (@gssjodhpur) November 5, 2026
ప్రాచీన గ్రంథాల డిజిటలైజేషన్‌కు జ్ఞాన భారతమ్ మిషన్
మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న ప్రాచీన గ్రంథాలు, తాళపత్రాలను భవిష్యత్ తరాల కోసం భద్రపరచేందుకు కేంద్ర ప్రభుత్వం జ్ఞాన భారతమ్ మిషన్‌ను చేపట్టింది. ఇందులో భాగంగా దేశంలోని పురాతన చేతి రాత ప్రతులను గుర్తించడం, వాటిని పరిరక్షించడం, డిజిటలైజ్ చేయడం చేస్తున్నారు. జ్ఞాన సంపదను కేవలం మన దేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు, విద్యార్థులు, ఆసక్తి ఉన్నవారికి అందుబాటులోకి తీసుకురావాలన్నది లక్ష్యం.
ఒకవైపు కశ్మీర్ చరిత్రను కళ్లకు కట్టిన రాజతరంగిణి, మరోవైపు జీవిత విలువలను బోధించే మహాభారతం, ఇంకో వైపు రాజ్యపాలన, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఆలోచనలను అందించే అర్థశాస్త్రం, ఇలా విభిన్న రంగాలకు చెందిన మూడు అపురూప గ్రంథాలకు యునెస్కో గుర్తింపు రావడం భారతీయ చరిత్ర, సంస్కృతి, విజ్ఞాన సంపదకు దక్కిన అరుదైన గౌరవం.





