Deepotsav1

Ayodhya Diwali Celebrations 2026: దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని రామనగరి అయోధ్యలో 2026 దీపోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. విశ్వాసం, ఆధ్యాత్మికత, సనాతన సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 'ప్రకాశవంతమైన అయోధ్య – అలౌకిక అయోధ్య' అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ వేడుకలు భక్తులు, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ చారిత్రాత్మక 10వ దీపోత్సవానికి భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Deepotsav2

30 లక్షలకు పైగా దీపాలతో రామనగరి వెలుగులు.. దీపోత్సవంలో భాగంగా సరయూ నది తీరంలోని రామ్ కీ పైడీతో పాటు 55కు పైగా ఘాట్‌లను లక్షలాది మట్టి దీపాలతో అలంకరించారు. ఈసారి 30 నుంచి 35 లక్షలకు పైగా మట్టి దీపాలను ఏకకాలంలో వెలిగించేలా ఏర్పాట్లు చేశారు. దీపాల కాంతులతో సరయూ నది తీరం సరికొత్త శోభను సంతరించుకుంది. రామాయణ ఇతివృత్తంతో రూపొందించిన శకటాలు, మతపరమైన ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు వనవాసం ముగించుకుని అయోధ్యకు తిరిగి రావడం, శ్రీరామ పట్టాభిషేకం వంటి ఘట్టాలను ప్రతీకాత్మకంగా ప్రదర్శించారు.

Deepotsav3

2,100 డ్రోన్లతో అద్భుతమైన వైమానిక ప్రదర్శన.. ఈ ఏడాది దీపోత్సవంలో సాంకేతికతకు పెద్దపీట వేశారు. 2,100కు పైగా డ్రోన్లతో ప్రత్యేక వైమానిక ప్రదర్శన నిర్వహించారు. ఆకాశంలో రామాయణంలోని ముఖ్య ఘట్టాలు, శ్రీరాముని జీవిత విశేషాలను ప్రతిబింబించేలా డ్రోన్ల ప్రదర్శన ఏర్పాటు చేశారు. వీటికి తోడు భారీ లేజర్ షో, 3డీ ప్రొజెక్షన్ మ్యాపింగ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ వేడుకల ప్రధాన ఉద్దేశం శ్రీరాముని ఆదర్శాలను, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం. అయోధ్యను అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంలోనూ దీపోత్సవం కీలక పాత్ర పోషిస్తోంది.

Deepotsav4

ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక కార్యక్రమాలు.. దీపోత్సవంలో భాగంగా ఉదయం 10 గంటలకు సాకేత్ కళాశాల నుంచి 21 శోభాయాత్ర శకటాలను పర్యాటక శాఖ మంత్రి జైవీర్ సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ శకటాలు రాంపత్ మీదుగా రామకథ పార్క్‌కు చేరుకున్నాయి. మధ్యాహ్నం అయోధ్యకు చేరుకున్న ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి తదితర ప్రముఖులు శ్రీరామ జన్మభూమి ఆలయంలో దర్శనం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం శ్రీరాముడు, సీతాదేవి అవతరణ, భరతుడితో కలయిక ఘట్టాలను ప్రదర్శించారు. ఆ తర్వాత శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమం, సాధువుల సన్మానం నిర్వహించారు.

Deepotsav5

సాయంత్రం 5:35 గంటల నుంచి 5:55 గంటల వరకు సరయూ నది తీరంలో హారతి కార్యక్రమం జరిగింది. అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7:50 గంటల వరకు దీపోత్సవ ప్రధాన వేడుకలు, 3డీ ప్రొజెక్షన్ మ్యాపింగ్, లేజర్ షో, డ్రోన్ ప్రదర్శనలు నిర్వహించారు. రాత్రి అంతర్జాతీయ, భారతీయ రామలీల ప్రదర్శనలతో పాటు పోటీల్లో విజేతలకు బహుమతులు అందించే కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.

Deepotsav6

విశ్వాసం, సంస్కృతి, అభివృద్ధికి ప్రతీకగా దీపోత్సవం.. అయోధ్య దీపోత్సవం కేవలం దీపాలు వెలిగించే వేడుక మాత్రమే కాదు. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ సంప్రదాయాలు, శ్రీరాముని ఆదర్శాలను ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప సాంస్కృతిక వేడుక. లక్షలాది దీపాల వెలుగులు, భక్తుల జయజయధ్వానాలు, సరయూ హారతి, అద్భుతమైన సాంకేతిక ప్రదర్శనలతో రామనగరి ఆధ్యాత్మిక వైభవాన్ని చాటిచెబుతోంది. కాగా, నవంబర్ 7న అయోధ్యలోని రామ్ కీ పైడీ సహా సరయూ నదీ తీరంలోని 56 ఘాట్‌లలో ఏకకాలంలో 30 లక్షల మట్టి దీపాలను వెలిగించి కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించనున్నారు.