Video: ఒక్క దిండు కోసం రూ. 40 వేలా? జపాన్‌లో భారతీయ మహిళ కొనుగోలుపై నెటిజన్ల రచ్చ!

చార్టర్డ్ అకౌంటెంట్ విపన్‌దీప్ కౌర్ తన జపాన్ పర్యటనలో ఖరీదైన దిండును కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. రోజులో ఎక్కువ సమయం ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ వాడకంతో మెడ నొప్పి మొదలైందని  తెలిపారు. కొంతకాలంగా మెడ నొప్పితో పాటు నిద్రలేమితో బాధపడుతున్నట్లు చెప్పారు.

నిజానికి గతంలో నిద్ర గురించి తాను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదని వయసు పెరుగుతున్న కొద్దీ నిద్ర నాణ్యత తగ్గుతోందని గుర్తించానన్నారు. తనకు నిద్రపోవడం అంటే ఎంతో ఇష్టమని.. అందుకే నిద్రను మెరుగుపరుచుకోవడానికి ప్రత్యేకంగా ఖర్చు చేసినట్లు తెలిపారు.

400 ఏళ్ల చరిత్ర ఉన్న దుకాణంలో.. కస్టమైజ్డ్ దిండు!

జపాన్‌లోని టోక్యో నగరంలో ఓ ప్రత్యేక బెడ్డింగ్ స్టోర్‌కు వెళ్లిన ఆమె దిండు కొనుగోలు చేశారు. ఆ దుకాణానికి 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. అక్కడ లభించే దిండ్లు సాధారణంగా మార్కెట్లో దొరికే వాటిలా ఉండవు. వినియోగదారుడి శరీర భంగిమ, నిద్రపోయే అలవాట్లను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేకంగా తయారు చేస్తారు.

విపన్‌దీప్ కూడా తన అవసరాలకు అనుగుణంగా దిండును కస్టమైజ్ చేయించుకున్నారు. ఇందుకోసం సుమారు రూ.40 వేలు ఖర్చు చేశారు. ఈ సందర్భంగా ఆమె తన నిర్ణయం వెనుక కారణాన్ని వివరిస్తూ.. ‘నా జీవితంలో నిద్రకు ఇంత ప్రాధాన్యం ఎప్పుడూ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు వయసు పెరుగుతున్న కొద్దీ నిద్ర మరింత కష్టమవుతోంది. రోజంతా ల్యాప్‌టాప్, మొబైల్ ఉపయోగించడం వల్ల మెడ నొప్పెడుతోంది. నాకు నిద్రపోవడం చాలా ఇష్టం. అందుకే ఈ దిండుపై పెట్టిన ఖర్చును మంచి పెట్టుబడిగా భావిస్తున్నాను’ అని తెలిపారు. ఈ ప్రత్యేక దిండు తన మెడ నొప్పిని తగ్గించడంతో పాటు మంచి నిద్రకు సహాయపడుతుందని ఆమె ఆశిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by CA Vipandeep Kaur (@soultravel_vipan)

రెండు వర్గాలుగా విడిపోయిన నెటిజన్లు!

విపన్‌దీప్ షేర్ చేసిన వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఆరోగ్యంలో నిద్ర కూడా కీలకమైన భాగమని, మంచి నిద్ర కోసం ఖర్చు చేయడంలో తప్పేమీ లేదని అంటున్నారు. ‘ఇది నిజంగా బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్’, ‘అద్భుత నిర్ణయం’ అంటూ ప్రశంసిస్తున్నారు. డబ్బు ఉంటే ఇలాంటి సౌకర్యాలను పొందవచ్చని మరికొందరు వ్యాఖ్యానించారు.

అయితే ఇంకొందరు మాత్రం ఒక దిండు కోసం రూ.40 వేలు ఖర్చు చేయడాన్ని ప్రశ్నిస్తూ ఖరీదైన దిండు కొనడం కంటే ముందుగా రోజువారీ అలవాట్లను మార్చుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్‌ను పక్కన పెట్టి, స్క్రీన్‌కు దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. దీనివల్ల నిద్ర నాణ్యత, స్లీప్‌ సైకిల్‌ మెరుగుపడే అవకాశం ఉంటుందని సలహా ఇచ్చారు.

మరికొందరైతే ఇలాంటి ఖరీదైన ఉత్పత్తులన్నీ మార్కెటింగ్ వ్యూహాల్లో భాగమని విమర్శించారు. మొత్తానికి ఓ సాధారణ దిండు కోసం రూ.40 వేలు ఖర్చు చేసిన భారతీయ మహిళ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు కేంద్రంగా మారారు. మంచి నిద్ర కోసం ఖర్చు చేయడం నిజంగానే మంచి పెట్టుబడా? లేక జీవనశైలిలో మార్పులు చేసుకుంటే సరిపోతుందా? అనే చర్చ మొదలైంది.