Paneer Kalakand Recipe: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే కలాకంద్.. స్వీట్ షాప్ స్టైల్‌లో ఇంట్లోనే తయారీ!
సాధారణంగా కలాకంద్ తయారు చేయాలంటే పాలను గంటల తరబడి మరిగించాల్సి ఉంటుంది. కానీ తాజా పన్నీర్‌ను ఉపయోగించి కొంచెం సులభమైన పద్ధతిలోనే స్వీట్ షాప్ స్టైల్ కలాకంద్ తయారు చేసుకోవచ్చు. పాలు, పంచదార, పన్నీర్‌తో పాటు కొన్ని పదార్థాలు ఉంటే సరిపోతుంది. మరి ఈ నోరూరించే స్వీట్ తయారీ విధానం తెలుసుకుందామా?

కావలసిన పదార్థాలు

  • చిక్కటి ఫుల్ ఫ్యాట్ పాలు – 2 లీటర్లు

  • పంచదార – ముప్పావు కప్పు

  • వైట్ వెనిగర్ – పావు కప్పు

  • నీళ్లు – తగినన్ని

  • నిమ్మ ఉప్పు – ఒక చిటికెడు (లేదా 5-6 చుక్కల నిమ్మరసం)

  • యాలకులు – 6 నుంచి 7

  • పిస్తా పలుకులు – కొద్దిగా

  • బాదం తరుగు – కొద్దిగా

  • బటర్ పేపర్ – అవసరమైనంత

తయారీ విధానం

ముందుగా ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి, అందులో ఒక లీటర్ ఫుల్ ఫ్యాట్ పాలు వేయాలి. పాలు అడుగున అంటుకోకుండా ఉండటానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. గరిటెతో కలుపుతూ పాలను ఒక పొంగు రానివ్వాలి. అనంతరం స్టవ్ ఆఫ్ చేయాలి.

ఇప్పుడు మరో చిన్న గిన్నెలో పావు కప్పు వైట్ వెనిగర్, పావు కప్పు నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని వేడి పాలలో కొద్దికొద్దిగా పోస్తూ నెమ్మదిగా కలపాలి. మూడు నుంచి నాలుగు నిమిషాల్లో పాలు విరిగి తెల్లటి పన్నీర్, ఆకుపచ్చటి నీరు వేరవుతాయి.

తర్వాత ఒక స్ట్రైనర్‌పై కాటన్ క్లాత్ వేసి పన్నీర్‌ను వడకట్టాలి. వెనిగర్ పులుపు పోవడానికి చల్లటి నీటితో బాగా కడగాలి. పన్నీర్ పూర్తిగా చల్లారిన తర్వాత క్లాత్‌తో గట్టిగా పిండి నీటిని తొలగించాలి. వేడిగా ఉన్నప్పుడే పన్నీర్‌ను పిండకూడదు.

ఇప్పుడు మరో గిన్నెలో మిగిలిన ఒక లీటర్ పాలు పోసి మరిగించాలి. పాలు పొంగు రాగానే ముప్పావు కప్పు పంచదార వేసి కలపాలి. మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి నిరంతరం కలుపుతూ ఉండాలి. సుమారు 20 నిమిషాల పాటు ఇలా మరిగిస్తే పాలు చిక్కబడి పరిమాణం తగ్గుతాయి.

ఈ సమయంలో ఒక చిటికెడు నిమ్మ ఉప్పు లేదా ఐదు నుంచి ఆరు చుక్కల నిమ్మరసం వేయాలి. దీనివల్ల పాలలో చిన్న చిన్న పలుకులు ఏర్పడతాయి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న పన్నీర్‌ను చేత్తో మెత్తగా పొడిచేసి పాలలో వేయాలి.

పన్నీర్‌లో పెద్ద పెద్ద గడ్డలు ఉంటే గరిటె వెనుక భాగంతో మెత్తగా మెదుపుతూ కలపాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి పన్నీర్‌లోని తేమ తగ్గి మిశ్రమం దగ్గరపడే వరకు నిరంతరం కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం ముద్దలా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.

కలాకంద్‌ను ఇలా సెట్ చేయాలి

స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆరు నుంచి ఏడు యాలకుల నుంచి తీసిన గింజలను వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఒక చతురస్రాకార ట్రేలో బటర్ పేపర్ పరచి, వేడిగా ఉన్న కలాకంద్ మిశ్రమాన్ని అందులో వేయాలి. స్పూన్‌తో సమానంగా పరచాలి.

దీనిపై సన్నగా తరిగిన పిస్తా పలుకులు, బాదం ముక్కలు చల్లాలి. అనంతరం పలుచటి కాటన్ క్లాత్‌తో కప్పి గది ఉష్ణోగ్రత వద్ద సుమారు 12 నుంచి 16 గంటల పాటు కదపకుండా ఉంచాలి.

అంతే.. నోరూరించే పన్నీర్ కలాకంద్ రెడీ!

సుమారు 12 గంటల తర్వాత కలాకంద్ చక్కగా గట్టిపడి సెట్ అవుతుంది. బటర్ పేపర్‌తో సహా ట్రే నుంచి బయటకు తీసి పదునైన కత్తితో చతురస్రాకార ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే.. స్వీట్ షాపులో దొరికే విధంగా మెత్తటి పన్నీర్ కలాకంద్ సిద్ధమైపోతుంది. పైన కనిపించే డ్రై ఫ్రూట్స్, లోపల ఉండే పాల పలుకులు ఈ స్వీట్‌కు ప్రత్యేకమైన రుచిని అందిస్తాయి.