
దీపావళి అంటే కేవలం ఒక రోజు దీపాలు వెలిగించి, బాణాసంచా కాల్చడం మాత్రమే కాదు. ఈ పండుగ వెనుక ఐదు రోజుల విశిష్ట సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలూ ఉన్నాయి. భారతదేశంలో ప్రాంతాన్ని బట్టి వివిధ కథనాలు ఉన్నప్పటికీ, ఈ ఐదు రోజుల ప్రాశస్త్యం ఎంతో ప్రత్యేకమైనది. మొదటిరోజు ధంతేరాస్ : ధన్ అంటే సంపద, తేరాస్ అంటే త్రయోదశి . ఈ రోజున లక్ష్మీదేవితో పాటు ఆయుర్వేదానికి అధిపతియైన ధన్వంతరిని పూజిస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యమని భావించి, శ్రేయస్సుకు చిహ్నంగా బంగారం, వెండి, పాత్రలు కొనుగోలు చేస్తారు. రెండవరోజు కాళీ చౌదాస్ : రక్తబీజుడు అనే రాక్షసుడి రక్తం నేలపై పడకుండా తాగి, అతడిని అంతమొందించిన కాళీదేవి విజయాన్ని స్మరిస్తూ ఈ రోజున పూజలు చేస్తారు. బెంగాల్లో దీనిని మహానిషా రాత్రిగా పిలుస్తూ కాళికాదేవిని పూజిస్తారు. ప్రతికూల శక్తుల నుంచి రక్షించమని అమ్మవారిని వేడుకుంటారు. మూడవరోజు లక్ష్మీ పూజ ప్రధాన దీపావళి): ఆశ్వీయుజ అమావాస్య నాడు జరిగే ప్రధాన వేడుక ఇది. రావణాసురుడిపై విజయానికి సంకేతంగా 14 ఏళ్ల వనవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంలో ప్రజలు దీపాలు వెలిగించి స్వాగతం పలికారనేది ఉత్తర భారత విశ్వాసం. దక్షిణ భారతంలో శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించిన రోజుగా జరుపుకుంటారు. ఈ రోజు కుటుంబ సమేతంగా లక్ష్మీ-గణేశ పూజలు చేస్తారు. నాలుగోరోజు గోవర్ధన్ పూజ : దేవేంద్రుడు కురిపించిన కుండపోత వర్షం నుంచి బృందావన ప్రజలను రక్షించడానికి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలిపై ఎత్తిన సంఘటనకు ఇది గుర్తు. ప్రకృతి పట్ల కృతజ్ఞతగా భక్తులు అన్నకూట్ అంటే రకరకాల వంటకాలు సమర్పించి కృష్ణుడిని ఆరాధిస్తారు. ఐదవరోజు భాయ్ దూజ్ : తోబుట్టువుల బంధానికి ప్రతీకగా ఈ రోజును జరుపుకుంటారు. యమునా దేవి తన సోదరుడైన యమధర్మరాజుకు నుదుట తిలకం దిద్ది ఆత్మీయంగా స్వాగతం పలికింది. సోదరీమణులు తమ సోదరుల దీర్ఘాయుష్షు, శ్రేయస్సును కోరుకుంటూ తిలకం దిద్దడం ఈ పండుగ ప్రత్యేకత.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెంగళూరు నుంచి హైదరాబాద్ 2 గంటలే..
ఐటీ ఉద్యోగుల నయా ట్రెండ్.. వర్క్ ఫ్రమ్ పార్క్
నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది? రేణుదేశాయ్ కామెంట్స్ వైరల్
