మోస్ట్ వాంటెడ్ మహిళా గంజాయి డాన్ అరెస్ట్! 30 కేసులు, 13 కేసుల్లో పరారీ.. ఆస్తుల చిట్టా పెద్దద్దే!

తెలంగాణ ఈగల్ ఫోర్స్ డ్రగ్స్ అక్రమ రవాణాపై మరో కీలక చర్య చేపట్టింది. గత తొమ్మిదేళ్లుగా గంజాయి అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. నానక్‌రామ్‌గూడకు చెందిన 51 ఏళ్ల కలాపతి నీతూ బాయిని ఈగల్ ఫోర్స్ పట్టుకుంది.

30 కేసులు.. 13 కేసుల్లో పరారీ

పోలీసుల దర్యాప్తులో నీతూ బాయిపై, ఆమె కుటుంబ సభ్యులపై 2017 నుంచి 2026 వరకు సుమారు 30 NDPS, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కేసులు నమోదైనట్లు వెల్లడైంది. ఇందులో 13 కేసుల్లో ఆమె పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో పలుమార్లు అరెస్టయి జ్యుడీషియల్ కస్టడీకి వెళ్లినప్పటికీ, బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత మళ్లీ గంజాయి వ్యాపారం కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నానక్‌రామ్‌గూడ, గచ్చిబౌలి ప్రాంతాల్లో బల్క్‌గా గంజాయి కొనుగోలు చేసి చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారుచేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా అద్దె ఇళ్లలో నివసించే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయాలు సాగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

పోలీసులకు చిక్కకుండా ప్రాంతాలు మారుస్తూ..

గత రెండేళ్లుగా పలు కేసుల్లో నిందితురాలైన ఆమె.. పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. నానక్‌రామ్‌గూడ, గచ్చిబౌలి, లంగర్‌హౌస్ ప్రాంతాల్లో తరచూ నివాసాలు మారుస్తూ పోలీసుల నిఘా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ వినియోగాన్ని కూడా తగ్గించినట్లు వెల్లడించారు. 2026 జూన్‌లో సైబరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు నానక్‌రామ్‌గూడలోని ఆమె నివాసంపై దాడి చేయగా, నిందితురాలు అక్కడ లేకపోవడంతో రూ.2.60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంటికి గంజాయి కొనుగోలు కోసం వచ్చినట్లు అనుమానించిన సుమారు 50 మందిని గుర్తించి కేసులు నమోదు చేశారు.

అప్పటి నుంచి ఈగల్ ఫోర్స్ టెక్నికల్ టీమ్ నిందితురాలి కదలికలపై నిరంతర నిఘా పెట్టింది. సాంకేతిక సమాచారం, క్షేత్రస్థాయి నిఘా ఆధారంగా ఆమె ఆచూకీని గుర్తించారు. చివరకు మంగళ్‌హాట్ వైపు ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి రూ.1,59,500 నగదు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

గతంలో భారీగా గంజాయి, నగదు పట్టివేత

నీతూ బాయి కుటుంబానికి సంబంధించిన గంజాయి అక్రమ రవాణా వ్యవహారాల్లో గతంలోనూ భారీగా మత్తు పదార్థాలు, నగదు పట్టుబడ్డాయి. 2023 ఆగస్టులో ఆమె కుమారుడు మహీంద్రా స్కార్పియో వాహనంలో 22 కిలోల గంజాయిని తరలిస్తుండగా గోల్కొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కుటుంబానికి సంబంధించిన ఆస్తుల తనిఖీల్లో సుమారు రూ.40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. 2023 అక్టోబర్‌లో గచ్చిబౌలి పోలీసుల దాడిలో 7.5 కిలోల గంజాయి, రూ.5 లక్షల నగదు పట్టుబడింది. 2024 మార్చిలో మరోసారి 22 కిలోల గంజాయి, రూ.22 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో కుటుంబ సభ్యులు కూడా అరెస్టయ్యారు.

గంజాయి సొమ్ముతో భారీ ఆస్తులా?

ఈ కేసులో పోలీసులు ఇప్పుడు ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించారు. లంగర్‌హౌస్‌లో రెండు G+3 భవనాలు, గచ్చిబౌలిలో ఒక G+2 భవనం, నానక్‌రామ్‌గూడలోని నివాసంలో అదనపు నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆస్తులు గంజాయి అక్రమ వ్యాపారం ద్వారా సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేశారా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. నిందితురాలు, కుటుంబ సభ్యులు, కుటుంబానికి చెందిన జయలక్ష్మి కిరాణా అండ్ జనరల్ స్టోర్ బ్యాంకు ఖాతాలను గతంలోనే ఫ్రీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆస్తుల పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, ఆదాయ వనరులను అధికారులు పరిశీలిస్తున్నారు.

జ్యుడీషియల్ కస్టడీకి నిందితురాలు

నీతూ బాయిని న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. నిందితురాలిని తదుపరి విచారణలో భాగంగా గంజాయి సరఫరాదారులు, విక్రయ నెట్‌వర్క్, ఆర్థిక లావాదేవీలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. డ్రగ్స్ విక్రయాలపై మాత్రమే కాకుండా, అక్రమంగా సంపాదించినట్లు అనుమానిస్తున్న ఆస్తుల మూలాలను గుర్తించడంపైనా ఈగల్ ఫోర్స్ దర్యాప్తు కొనసాగిస్తోంది.